WhatsApp Channel Join Now
Telegram Group Join Now

What is Autism Spectrum Disorder..? Symptoms Causes

What is Autism Spectrum Disorder..? Symptoms Causes

ఆటిజం అంటే ఏమిటి..? లక్షణాలు ఎలా ఉంటాయి..? తల్లిదండ్రులు ఏమి చేయాలి ..!

ఆటిజం వ్యాధి కాదు. మందులేని న్యూరో డిజార్డర్! ఒక్కో చిన్నారిలో, ఒక్కో తరహా సమస్య ఉంటుంది. వీటన్నిటినీ కలిపి స్పెక్ట్రమ్ గా వ్యవహరిస్తారు. ఎక్కడో అమెరికా, యూరప్ దేశాల్లో పిల్లల సమస్య కాదు ఇది! మన చుట్టూ మనకు తెలియకుండా ఓ ఆటిజం సమాజమే ఏర్పడుతోంది. Autism spectrum disorder వంటి న్యూరలాజికల్ డిజార్డర్ ఉన్న పిల్లలు.. దేశంలో కోటిమందికి పైనే ఉన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రెండు లక్షల మందికి పైనే ఉంటారు. ( What is Autism Spectrum Disorder..? Symptoms Causes )

కారణాలు కాదు.. ఏం చేయాలో ఆలోచించాలి..!

నిజానికి ఆటిజం వ్యాధి కాదు. It’s a neurodevelopmental disorder. అది ఎందుకు వస్తుందో ఇప్పటికీ కచ్చితంగా తేలలేదు. మన దేశంలో గత 20 ఏళ్ల నుంచి ఆటిజం కేసులు పెరుగుతున్నాయి. లైఫ్ స్టైల్ మార్పులు, రేడియేషన్, పొల్యూషన్, పంటల్లో క్రిమి సంహారకాలు, న్యూక్లియర్ ఫామిలీస్, అపార్ట్మెంట్ కల్చర్, ప్రెగ్నెన్సీ లో సమస్యలు, గర్భిణిగా ఉన్నప్పుడు మానసిక ఒత్తిళ్లు, డెలివరీలో సమస్యలు, తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్సుకు పిల్లలు ఎడిక్ట్ కావడం..ఇలా ఒకటేమిటి ఎన్నో కారణాలు పిల్లల మానసిక ఎదుగుదల పాలిట శాపంగా మారుతున్నాయి.

జీవితాన్ని అలవాటు చేయాలి

మనకు జీవితంలో అనేక అలవాట్లు ఉంటాయి. కానీ ఆటిజం పిల్లలకు జీవితాన్నే అలవాటు చేయాలి. ‘భాషరావాలంటే బతకాలి’ అన్నమాట ఎంత నిజమో.. ఆటిజం పిల్లలకు ప్రపంచాన్ని అలవాటు చేయడం అంత నిజం! మన చేతుల్లో ఉన్నది అదొక్కటే!

ఆటిజం పిల్లల బ్రెయిన్ నిరంతరం ట్రైన్ చేయాలి. మైల్డ్, మాడరేట్, సివియర్..ఇలా ఆటిజం తీవ్రతను బట్టి.. చిన్నారులకు ఆక్యుపేషన్, బిహేవియర్, స్పీచ్ వంటి రకరకాల థెరపీలను నిపుణులు సూచిస్తారు. ఆ థెరపీలను అందించే క్రమంలో తల్లిదండ్రుల్లో ఒకరు పిల్లలకు ఇవి నేర్పించేందుకు పూర్తిగా అంకితం కావాల్సివుంటుంది. కొన్నేళ్లపాటు కుటుంబపరంగా, సామాజికంగా, ఆర్థికంగా అవరోధాలు ఎదురవుతూనే ఉంటాయి. కానీ పిల్లల భవిష్యత్ కోసం ధైర్యంగా నిలబడాలి.

ఆటిజం పిల్లల బాధ్యత తల్లిదండ్రులదే కాదు..సమాజానిది కూడా! ప్రభుత్వాలు కలగజేసుకోకపోతే, భారత్లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో.. ఈ ప్రత్యేక అవసరాలున్న పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరమే అవుతుంది. థెరపీలతో మొదలుపెట్టి..విద్య, వైద్యం, సామాజిక భద్రత ఇలా అన్ని విషయాల్లో ప్రభుత్వం ఈ పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సివుంది.

Autism Symptoms: అమ్మా నాన్నలారా దయచేసి ఆటిజం గురించి తెలుసుకోండి..

  • మీ ఇంట్లో చంటి పిల్లలు ఉన్నారా?
  • వాళ్ళు పుట్టగానే ఏడ్చారా? లేదా?
  • తల్లి పాలు తాగారా? లేక ఫార్ములా మిల్క్ కి అలవాటు పడ్డారా?
  • మీ పిల్లలు మీకు Eye Contact ఇస్తున్నారా?
  • మెడ నిలపగలుగుతున్నారా?
  • సమయానికి బోర్లా పడ్డారా? లేదా?
  • రెండు చేతులతో పాకుతున్నారా? లేక ఇబ్బంది పడుతున్నారా?
  • సరిగ్గా నడుస్తున్నారా? నడిస్తే.. కాళ్ళు ఎలా ఉన్నాయి?
  • నేల మీద సరిగ్గా కూర్చోగలుగుతున్నారా?
  • లేక కాళ్ళు చాపలేక.. W షేప్లో కూర్చొంటున్నారా?
  • ముఖ్యంగా పేరు పెట్టి పిలిచినప్పుడు పిల్లలు పలుకుతున్నారా? లేదా?
  • తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్నారా? లేక.. ఎవ్వరినీ పట్టించుకోకుండా.. చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారా?
  • తమ ప్రపంచంలో ఉంటూ.. ఆడిన ఆటే ఒంటరిగా ఆడుతున్నారా?
  • రెండేళ్లకు కూడా చిన్న చిన్న మాటలు కూడా రావడం లేదా? ఎప్పుడూ హైపర్ గా ఉంటున్నారా?
  • వద్దు అంటే.. తమను తాము Hurt చేసుకుంటున్నారా? లేదా ఎదుటివారిని hurt చేస్తున్నారా?
  • నలుగురి మధ్యకు వెళ్ళినప్పుడు ఇమడలేకపోతున్నారా?
  • ముఖం ముట్టుకోనివ్వడం లేదా?
  • బ్రష్ చేయనివ్వడం లేదా?
  • స్నానం చేయడానికి గోల గోల చేస్తున్నారా?
  • అన్నం తినడానికి ముప్పుతిప్పలు పెడుతున్నారా?
  • Facial expressions ఉన్నాయా..  లేదా .. ?
  • టాటా చెప్పడం.. మీరు ఇంటికి రాగానే ముద్దు పెట్టుకోవడం వంటి emotions ఉన్నాయా లేదా?
  • చేతులు, కాళ్లు ఉపయోగిస్తూ.. Fine Motor Skills డెవలప్ అవుతున్నాయా లేదా?

పిల్లల సోషల్ బిహేవియర్ ఎలా ఉంది?

ఇవన్నీ చిన్న విషయాలని తేలిగ్గా తీసుకోకండి. తీరిక లేకుండా.. యంత్రాల్లా పనిచేస్తూ.. పసి పిల్లలను పట్టించుకోవడం మానేయకండి. మన నిర్లక్ష్యం పిల్లల్లో ఆటిజం/ ADHD లక్షణాలు పెరిగేలా చేస్తుంది. పెద్దల తప్పులకు పిల్లలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఏ కెరీర్ కోసం రాత్రీపగలు కష్టపడుతున్నారో.. దానిని వదిలి Therapy Centres చుట్టూ తిరగాల్సి ఉంటుంది. Occupation Therapy, Sensory Integration, Behaviour Therapy, Speech Therapy..ఇలా మీరు ఎప్పుడూ వినని విషయాల గురించి రీసెర్చ్ చేసి.. రోజూ మూడు నాలుగు గంటలసేపు థెరపీ సెంటర్లకు తీసుకెళ్లాల్సి వుంటుంది. అంతేకాదు, థెరపీకి కనీసం 12 వేలు చొప్పున.. ప్రతి నెలా 30-40 వేలు ఖర్చు పెట్టాల్సి వుంటుంది. ఇంత ఖర్చు పెట్టినా పిల్లలు నార్మల్ అవుతారని డాక్టర్లు గ్యారంటీ ఇవ్వలేరు. మూడు నెలలకు ఒకసారి Psychology assessment, Pediatric Neurologist రివ్యూల కోసం గంటలకు గంటలు టెన్షన్ తో ఎదురుచూడాల్సి ఉంటుంది.

Play School కి వెళ్లాల్సిన చిన్నారులను థెరపీలకు తీసుకెళ్లడం.. ప్రపంచం తెలియని పిల్లలు ఎలా బతుకుతారో అన్న ఆందోళన.. తమ తర్వాత పిల్లల్ని ఎవరు చూసుకుంటారన్నఆవేదన.. అర్థం చేసుకోలేని మనుషులు.. అర్థమైనా పట్టించుకోని ఆప్తులు.. చెప్పుకోలేని అవమానాలు.. థెరపీల కోసం ఆర్థిక ఇబ్బందులు.. తల్లిదండ్రులను కుంగదీస్తాయి. ముఖ్యంగా తల్లులను కుమిలిపోయేలా చేస్తాయి. అందుకే పిల్లలకు సమయం ఇవ్వండి. వారి శారీరక, మానసిక ఎదుగుదలను జాగ్రత్తగా గమనించండి. పిల్లలు హైపర్ గా ఉండటం, పెంకిగా ఉండటం సహజమే. కానీ పిలిచినా పలకక పోవడం, ఐ-కాంటాక్ట్ ఇవ్వక పోవడం, చేసిన పనే మళ్లీ మళ్లీ చేయడం, సోషల్ బిహేవియర్ లేకపోవడం తేలిగ్గా తీసుకోవద్దు. అవి ఆటిజం లక్షణాలు.

మైల్డ్, మాడరేట్, సివియర్..ఇలా మూడు స్థాయిల్లో ఆటిజం తీవ్రతను సైకాలజిస్ట్ లు అంచనా వేస్తారు. ఒకవేళ ఆటిజంఅని తేలినా.. తల్లిదండ్రులు కుంగిపోకూడదు. ఓపిక అలవాటు చేసుకోవాలి. ఒకరినొకరు నిందించుకుని టైమ్ వేస్ట్ చేసుకోకూడదు. ముఖ్యంగా తల్లికి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అండగా నిలవాలి.

-భాను కిరణ్ (ఒక ఆటిజం చిన్నారి తండ్రి)

(ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ & సమగ్ర శిక్ష వారి  మన బడి మే 2025 నెల మాసపత్రిక నుండి యధాతధంగా..)

Read also..

ఆటిజం పిల్లల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చొరవ “ఆటిజం” కేంద్రాల ఏర్పాటు..

CLICK HERE

Thank you for reading... Share this...
error: Content is protected !!