Mana Badi October 2025 Monthly e-Magazine
“మన బడి” అక్టోబర్ 2025 మాసపత్రిక
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో వెలుబడుతున్న విద్య వికాస మాసపత్రిక మన బడి (Mana Badi October 2025 Telugu Monthly e-Magazine)
సంపాదకుల మాట: పట్టుదల పలికిన విజయం
-బి శ్రీనివాసరావు, IAS; ఎడిటర్ & రాష్ట్ర పథక సంచాలకులు సమగ్ర శిక్షా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పదవులు కాదు, బాధ్యతలు; ఉద్యోగాలు కాదు, ఉపాధి మార్గాలు. ఇవే నేటి యువతరం ఆలోచనలు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యతలు ఉన్నా… తమ లక్ష్యాన్ని చేరుకోవడంలో పట్టుదల, సంకల్పం ఉంటే అసాధ్యమనేది ఏమీ లేదని నిరూపించారు ఇటీవల మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులుగా ఎంపికైన వేలాది మంది అభ్యర్థులు. ఈ సంచికలో కవర్ స్టోరీ “కొలువు సాధించిన గురువులు” కేవలం నియామక ప్రక్రియ వివరాలను అందించడం లేదు, ఇది ఆత్మవిశ్వాసం, నిరంతర శ్రమతో కూడిన విజయగాథల సమాహారం.
ఒకే ఊరు నుంచి పది మందికిపైగా టీచర్లు ఎంపికవడం, ఒకే కుటుంబంలో తండ్రీకొడుకు, భార్యాభర్తలు, అక్కాచెల్లెళ్లు ఒకేసారి ఉద్యోగాలు సాధించడం చూస్తుంటే, డీఎస్సీ అనేది ఒక ఉద్యోగ జాతరలా కాకుండా, కలల సాకారంలా కనిపిస్తోంది. పల్లెటూళ్లలో ఒకరికే ప్రభుత్వ ఉద్యోగం వస్తే గొప్పగా చెప్పుకునే రోజుల్లో, లక్కవరం, తెనగల్లు వంటి గ్రామాలు ఏకంగా 25 నుంచి 40 మందికిపైగా ఉపాధ్యాయులను అందించడం చూస్తే, ఆ ప్రాంతాల్లోని యువత విద్య పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నారో అర్థమవుతుంది.
ఈ గ్రామాలు రేపటి తరానికి విద్యా కేంద్రాలుగా, ఆదర్శాలుగా నిలుస్తున్నాయి. కుటుంబ బంధాలు, వృత్తి బంధాలుగా మారడం. తండ్రి పనిచేస్తున్న పాఠశాలలోనే కొడుకు ఉద్యోగం సాధించడం, అక్కాచెల్లెళ్లు ఒకే స్కూల్లో స్కూల్ అసిస్టెంట్లుగా చేరడం, భార్యాభర్తలు ఇద్దరూ ఒకేసారి డీఎస్సీ కొలువులు సాధించడం, ఒకే ఇంట్లో ముగ్గురు ఉపాధ్యాయులుగా ఎంపికవడం వంటివి ఈ విజయాన్ని మరింత మధురంగా మార్చాయి. ఈ విజయాలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి కష్టజీవుల విజయాలు. బైక్ సీట్లు కుట్టే మెకానిక్ నుండి మేస్టారుగా మారిన కర్రి నాగేశ్వరరావు, ఏడేళ్లు పెయింటింగ్, కూలి పనులు చేసినా చదువును విస్మరించని చాట్ల రత్నరాజు, తోపుడుబండి వ్యాపారి కూతురై రెండు కొలువులు సాధించిన పార్వతి, ఆర్మీ సేవ తర్వాత విద్యా సేవకు సిద్ధమైన బంటు శివ వంటి వారి ప్రయాణాలు ప్రతి నిరుద్యోగికి స్ఫూర్తిదాయకం.
అలాగే, పదో తరగతిలో పెళ్లయినా ఆగిపోని శివ స్వప్న కల, డెంగీతో భార్య మరణించినా ఆమె కోరికను నెరవేర్చడానికి పట్టుదలతో చదివిన ఆరేపల్లి రామకృష్ణ త్యాగం మన హృదయాలను తాకుతాయి. పేదరికం, కుటుంబ భారం, వ్యక్తిగత విషాదాలు వారిని వెనక్కి లాగినా, ‘నాన్న కల నెరవేర్చాం’ అన్న సంతృప్తి, ‘భార్య కోరిక తీర్చాం’ అన్న ఆనందం వారి విజయానికి అసలైన కిరీటాలు. ఈ కొత్త గురువులందరూ తమ జీవితానుభవాల నుంచే పట్టుదల, నిరాశను జయించడం, శ్రమ విలువ వంటి పాఠాలు నేర్చుకున్నారు. వారు బోధించే పాఠాలు కేవలం పుస్తకంలోని విషయాలకే పరిమితం కావు, వారి జీవిత పోరాటాలు కూడా విద్యార్థులకు జీవిత పాఠాలు అవుతాయి.
Mana Badi October 2025 Magazine
DOWNLOAD
